Tuesday, May 18, 2010

శీనుగాడు - చిరంజీవి ఫేన్

టైటిల్ కాపికొట్టుకొచ్చేహేడు కదా అదే స్టోరీని తిరగేసి రాహెత్తాడేమో అనాసరంగా వచ్చేవని గట్టిగా తిట్టేస్కుని కంగారుపడి కంప్యూ టర్ కట్టేకుండా ఓసెణం ఓపిగ్గా ఉంటే మీకు మా సీను గాణ్ణి పరిసియం చేహెత్తాను ఆ తరవాత మనం మనం ఏం మాహాడుకున్నా ఓ లెఖ్క అది ఉంటాది.... ఏవంటారు..... ఏవంటార్లెండి .......విషయంలోకొత్తే.....




అనగనగనగనగా...... ఒకూరు. ఊరన్నాకా కున్నీదులు, ఈదుల్లో వరాసగా ఇళ్లు, ఇళ్లల్లో మడుసులు, మడుసులున్నాక ఆళ్ల కోసం గుళ్లూ, గోపురాలు, సెట్లు, సెరువు గట్లు, పుట్టలు, రకరకాల పిట్టలు, పాడి, పంటలు   ఎగసెట్రా........ ఈటన్నిట్టిలితోపాటు  పతీఊళ్ళోనీ ఒక్కటైనా పనికిమాలిన గేంగ్ ఉండటం మన తెలుగు సంప్రదాయం. అందుకని అదీ ఉంది. అలాంటి ఒక గ్యాంగ్ కి లీడరైన ఒక ఆణిముత్యాన్ని మీకు చూపించబోతున్నాను ఆడెలాఉంటాడో చూడాలనుకుంటే (సారి.... చదవాలనుకుంటే) నాతో రండి.....


జాగర్త కింద ముగ్గులు తొక్కేకుండా రండి.......రేప్పెద్దపండక్కదా అందుకే ఈ ముగ్గులూ అయ్యీని........ఏంటి అలాఅయిపోయారు ఓహో...... రామాలయం మైక్ లో “రగులుతోంది మొదలిపొద.... “ పాటెట్టిన ఎదవెవడనుకుంటున్నారా.......... ఇంకెవడు మన శీను గాడే కాని అది రామాలయం లోంచి కాదు దానెనకాలున్న ఇంటిలోంచి. చిరంజీవి కటౌటు టాగూరు పోస్టరు చూసి ఇదేదో పజారాజ్జిం పార్టీ ఆపీసని ఆవేశపడి ఓ..వినతి పత్రాలయ్యి రాసేకండి అది శీనుగాడిల్లు. బయట శంకర్ దాదా జిన్దాబాద్ బేనర్ మీద ఒడియాలు ఎండబెడుతుంది కదా ఆవిడే శీను గాడి మదర్ ఇండియా............ మనోడి ఎదవపనులికి బాగా సపోర్టింగ్ కేరెట్రు....రిక్షావోడు సినిమాలో మనోరమ టైపు..... అందుకే ఈడు అద్దరాత్రి దాకా తిరిగొచ్చి ఎండెక్కీదాకా లెగప్పోయినా పెద్దగా ప్రోబ్లం ఉండదు. ఇంతకీ ఈడేడంటారా..... కొంచుం గుమ్మం లోపలికి తలకాయెట్టి ఫేసు టర్నింగ్ ఇచ్చుకోండి.... ఏంటచ్చు శిరంజీవి లాగున్నాడా.....అదేమరి.....అది శిరన్జీవి బొమ్మే....... అటేపు కాదు ఇటేపు టర్నింగ్ ఎయ్యిండి......... గడ్డి లారీలా జుట్టేసికుని ఎర్రగా తెల్లగా ఉన్నాదేదో తాగుతున్నాడు..... ఆడే శీనుగాడని మీ అనుమానం కదా....
  హ హా మీ అనుమానం రైటే..........ఆడే ఆ ఎదవ...........కానీ ఆడు తాగేదేంటని మళ్లీ అనుమానం వొచ్చిందా.........ఇన్నిఅనుమానాలు మీకు రాకూడదు ఐనా ఈసారికి చెప్పేస్తాను.... ఇన్నాకా కడుపులో అదోలా ఐపోయిందని ఫీలవ్వకూడదుమరి..... ఇయ్యాల బోగి పండక్కదాని ఆళ్లమ్మ సేమియా పాయసం చేత్తే దాంట్లో సాంబార్ కలుపుకుని తాగుతున్నాడు...... ఎదవ టేస్టు ఈడూని. అసలీడికి ఇలాన్టి టేస్టులు ఎలా అబ్బినియ్యంటే.....
దానిక్కొంచుం ప్లాష్ బేగ్ లోకెల్లాలి.......

                                                               ***
                                           ........  అది చాలా పాత కాలం .......

అప్పుడు శీనుగాడి వయసు ఈడు పాకడానికి మాత్రమే సరిపోయేది కాని ఈడు తాగడానికి ఈళ్ల ఆవిచ్చే పాలన్నీ పట్టించినా సరిపోయేది కాదు.
పంట చేతికొచ్చాకా పందికొక్కులు తినేసినట్టు, ముగ్గులేసిన వాకిట్లో కళ్ళాపు కొట్టేసినట్టు పొదుక్కొచ్చిన పాలన్నీ ఈడే తాగేత్తుంటే దీనంగా చూస్తుండేది ఆవు. దూడకివ్వటానికి కూడా పాలు మిగల్చని శీనుగాడి మీద కట్టలు తెంచుకున్న కోపం ఉన్నా కట్లు తెంపుకొనే ఓపిక లేక, కుమ్మేద్దామని సిద్దమైనా కొమ్ములు సరిగా లేకపోవటం చేత ఆ ప్రయత్నాలేవీ చెయ్యలేదు, ఈ అన్యాయాలు చెప్పుకోడానికి అప్పట్లో అక్కినేని అమలకూడా లేకపోవడంతో ఇక లాభం లేదని ఒకరోజు పాలివ్వటం మానేసింది. ఆవు అంతు చూద్దామని పట్టరాని కోపంతో పాక్కుంటూ వచ్చిన శీనుగాడు పక్కనేఉన్న గుంటలో పడిపోయాడు. ఆవు హెల్త్ కోసమని తవుడు వగైరా కలిపి చేసిన “కౌడ్రింక్” అదే గుంటలో ఉండడంతో, దాంట్లో పడికొట్టుకుంటున్న శీనుగాణ్ని చూసి పీడవిరగడైందనుకుంది.... కాని ఆశ్చర్యం శీనుగాడు దాంట్లో ఉన్నది సగం తాగెయ్యడమేకాకుండా రోజూ అదే కావాలని మారాంచేసేవాడు. అప్పట్నించి వీడు మరింత స్ట్రాంగ్ గా, మరింత షార్ప్ గా, మరింత టాల్ గా మారాడు (ఇదే ఆ తరువాత జూనియర్ హార్లిక్స్ గామారి మనముందుకొచ్చింది). అప్పట్నించి అదే టేస్ట్ కావాలని రకరకాల కాంబినేషన్లు ట్రై చేస్తూనే ఉన్నాడు.


ఈయ్యాలీడు లేటెస్ట్గ్ గా చేసిన ఎదప్పనేంటంటే పెసిడెంట్ గారి పాక్కాడ కోయిన్చి పెట్టిన తుమ్మ దుంగలన్నీ పట్టుకొచ్చి పొద్దున్నే భోగిమంటలో ఏస్సేడు. ఇందాక గాంధీ బొమ్మకాడ మీరుసూసిన మంటదే. ఇదంతా ఈడొక్కడే సేస్సేడనుకుంటున్నారా......... అబ్బే.......... ఈడికింకో ఇద్దరున్నారు........ ఒకడి పేరు వేణు ఇంకోడి పేరు బాను. ఈ రెండూ కూడా ఫ్రేం కట్టించాల్సిన ఫొటోలే.

ఏణు గాడిల్లు ఈపక్కనే ఆ కొబ్బరికాయిల గుట్టకాడ, ఈల్ల నాన్నది కొబ్బరికాయల యేపారం మరి.  కానీ ఈడికియ్యేవీ పట్టవ్ ఎప్పుడికైనా జార్జి బుష్ అంత పెద్ద సైంటిస్ట్ అవ్వాలని ఈడి కోరిక. అప్పట్లో లాడెన్ని ఎలాగైనా నేనే “కనిపెడతానని” ఎక్కడపడితే అక్కడ బుష్ బొమ్మల్తో హెడ్డింగ్లు రావటంవల్ల ఈడు లాడెన్ అంటే పెద్ద రాకెట్ అని దాన్ని కనిపెడతానన్న బుష్ పెద్ద సైంటిస్ట్ అని ఫిక్స్ అయిపోయాడు. అంటే మనోడికి పేపర్లో బొమ్మలు, హెడ్డింగ్లు తప్ప మేటర్ చదివే అలవాటు లేదు. ఈల్ల నాన్న కూడా ఈడికి పెద్దగా పనులు చెప్పడు.... ఓసారిలాగే కొబ్బరికాయలు తీయించుకురారా అని పొలం పంపితే “గాలేత్తే సెట్టూగుతుందా సెట్టూగినందుకు గాలేత్తుందా” తెలుసుకుందావని సెట్టు సివరికంటా ఎక్కేహేడు అదూక్కుండా పట్టుకుంటే గాలాగిపోద్దేమో సూద్దావని. కాని అప్పుడే పెద్ద గాలీదుమ్మూ రావడంవల్ల ఈడెక్కిన కొమ్మిరిగి కిందపడ్డం.... ఈల్ల నాన్న పెసిడెంటు కి బాకీపడ్డం ఒకేసారి జరిగింది. అంటే నడువిరిగిన ఈడి ఆరోగ్య పరిస్థితి చక్కదిద్దటానికి ఈల్ల నాన్న ఆర్దిక పరిస్థితి సరిపోలేదు అందుకే అప్పు చెయ్యక తప్పలేదు. ఇన్ని జరిగేక్కూడా ఈడు తిన్నంగా అయ్యేడా........ అబ్బే రాత్రి పెసిడెంటు గారి దుంగలు దొంగతనం సెయ్యడానికి బానుగాడు రానంటే బలవంతంగా తీసుకెల్లిందీడే.


బానుగాడు రానంటానికి రెండు కారణాలున్నాయి అయ్యేంటో మీకు ముందు ముందు తెలుస్తాయి.


ఈ బానుగాడిదీ చిన్న స్టోరీ ఏంకాదు ఈడిల్లు పక్కీదిలోనే ఉంటాది. ఈడు సీకటి పడ్డాక సొంతింట్లో బాత్ రూం కెల్లాలన్నా ఈడి బామ్మ తోడు రావాలి. ఈల్ల నాన్న ఊరి మాజీ పెసిడెంటు, పనికాహార పదకంలో రోడ్లెయ్యమని డబ్బులొత్తే  ఆటిల్తో పక్కూర్లో పేకాట పదకం పెట్టి పూర్తిగా ములిగిపోయేడు. అందుకే ఈసారి ఓట్లు బదులు.... జనాల చీవాట్లు మాత్రమే వచ్చినియ్. ఈల్లింట్లో పెత్తనమంతా బానుగాడి బామ్మదే....... ఆవిడ ఒక్కసారి చెపితే ఈడికి వంద సార్లు ఇనిపిస్తాది, పేరు భానుమతి అదేపేరు మనోడిదీను. అదే అంటే అలాగే కాదు ఈడు మొగోడని అనుమానించడం వల్ల భానుమతి లో “మతి” తీసేసి ప్రకాష్ కలిపేరు. కాని దురదృష్టవశాత్తూ ఈడి నామకరణం రోజు పంతులు గారు చదివిన మంత్రాలు పనిచెయ్యటం వల్ల పేరులోంచి తీసేసిన “మతి” ఈడి బుర్రలోంచి కూడా కొంచుం పోయింది. అప్పట్నించి ఈడి నామధేయానికి నానార్ధాలుగా “తింగరెదవ”, “పిచ్చి సన్నాసి” అనే సమానార్దాలు కూడా వాడుకలోకొచ్చాయి.


ఈడి చిన్నప్పుడు చెప్పినమాటింటాడని దెయ్యాలు భూతాలు అని లేని పోని కబుర్లు చెప్పింది ఈళ్ల బామ్మే...... ఇప్పుడీళ్ల డబ్బా టివి లో మహేశ్వరి సినిమా వచ్చినా దెయ్యమని జడుసుకొని కళ్లుతిరిగి పడిపోతాడు. అందుకే బామ్మ ఎప్పుడూ ఇంటి ముందు రాగిరేకుల్లో యంత్రాలు, ఈడి ఒంటి మీద తాయెత్తుల్లో మంత్రాలు కడుతూ ఉంటాది. ఈళ్ల నాన్న మాజి పెసిడెంట్ ఐనా ఈల్లింట్లో ఇంకా పాత టివి ఉందేంటని చూస్తున్నారా?..... దానికీ ఓ కతుంది.... అప్పట్లో...... అంటే భానుగాడి నాన్న పదవిలో ఉండగా పెద్ద చెరువులో పూడిక తియ్యాలని తెచ్చిన నిదుల్తో పెద్ద సైజు టివి ఒకిటి కొని ఇంటికి పట్టుకొచ్చాడు. కొత్త ఐటెం ఇంట్లోకేమొచ్చినా దానికి ఓపెనింగ్ సాదారణంగా బామ్మే చేస్తుంది. ఈది మొత్తానికి రంగుల టివి మొదటి సారి రావటం వల్ల, అప్పటికే వెయ్యి ఎపిసోడ్లు పూర్తిచేసికొన్న “అనంత రాగాలు” సీరియల్లో హీరోయిన్ చేసుకొనే మూడో పెళ్లి కలర్ లో చూద్దామనే కుతూహలం వల్ల చుట్టుపక్కల ఆడోళ్లంతా వచ్చి లైన్లో నిలబడి చూస్తున్నారు టివి ఎప్పుడు మొదలవ్వుద్దా అని. ఇంతలో బామ్మ గారు టివి కి పసుపు కుంకుం రాసి కొబ్బరికాయ్ కొడదామనుకునేంతలో అప్పుడే హైస్కూల్ నించి వచ్చిన మన చిన్నారి భాను కొబ్బరికాయ్ నేనే కొడతానని మారాం చేసాడు. పిచ్చిసన్నాసి సరదాపడుతున్నాడని బామ్మ గారు ఈడి చిట్టి చేతుల్లో కొబ్బరికాయ్ పెట్టారు. మరుక్షణం లో ఈడు కొబ్బరికాయ కొట్టడం..... అదే క్షణం లో సూదిగా ఉన్నదేదో ఫాస్ట్ గా వచ్చి ఈళ్ల నాన్న కంటికింద గుచ్చుకోడం వెంట వెంటనే జరిగిపోయాయ్. గుచ్చుకున్నది కొబ్బరి టెంకు అనుకున్నారు కాని అది గాజు పెంకని తెలుసుకోడానికి ఎంతోసేపు పట్టలేదు.


సన్నివేశం కత్తిరిస్తే... పగిలిపోయిన టివి ముందర బానుగాడి జుట్టుపట్టుకొని భరతనాట్యం చేస్తూ ఈళ్ల నాన్న, ఆడ్ని కాపాడ్డానికి అడ్డం పడి కథాకళి ఆడుతూ బామ్మ, కిందపడిన గాజుముక్కలు తుడుస్తూ  ఈళ్లమ్మఒకే ప్రేంలో ఉన్నారు. ఎలాగోలా ఈడ్ని కాపాడిన ఈళ్ల బామ్మ తగిలిన దెబ్బలకి ఎన్నపూస రాస్తూ ప్రేమగా అడిగింది.. “ఏరా తింగరెదవ ఎవడన్నా టివి కేసి కొబ్బరికాయ కొడతార్రా....” అని, అంతే పౌరుషం ముంచుకొచ్చిన భాను గాడు ఒక్కసారిగా లెగిసి ముక్కు తుడుసుకొంటూ

“ ఛీ..... మీ పెద్దోళ్లున్నారే......... ఎప్పటికి మారరు. మొన్న కొత్తగా కొన్న రుబ్బురోలు మీద కొబ్బరికాయ కొడితే నిన్నెవరూ కొట్టలేదు ఇయ్యాల నేను టివి మీద కొడితే నన్ను పట్టుక్కొట్టారు ఛ్చి ఛ్చి” అనుకొంటూ వెళ్లిపోయాడు. అప్పట్నించి ఇప్పటిదాకా ఈళ్ల నాన్న కొత్త టివి కొనే సాహసం చెయ్యలేదు, ఇంట్లోవాళ్లకి కొనమని అడిగే అవకాశమూ ఇవ్వలేదు.


 ఇవాళెందుకో భానుగాడికి బాగా టెన్షన్ గా ఉంది. పొద్దున్నించి హిస్టరీ నోట్సు పట్టుకుని తెగ రాస్తున్నాడు. పండగ పూట కూడా సదువు ధ్యాసే ఈడికి.... ఎప్పుడికైనా రెండు గోదారి జిల్లాలికి కలిపి ఈడొక్కడే కలెట్రు అవుతాడనేది ఇరుగు పొరుగు వాళ్లతో అరుగు మీద సమావేశం పెట్టినపుడు బామ్మగారు తరచుగా చెప్పేమాట. అవునుమరి శీను గాడు పదిలో తన్నేసాడు, వేణు గాడు ఇంటర్ లో తన్నేసాడు.... ఈడొక్కడే ఆరెండూ దాటుకొని డిగ్రీ చివరిదాకా వచ్చింది. ఇంతకీ ఈడి టెన్షన్ అదికాదు. పండగనీ, ఈడికిష్టమనీ చేసిన పూర్ణం కుడుములు పట్టుకొని బామ్మగారొస్తే........... అవొద్దని అప్పటివరకు రాసిన పేపర్ చింపుకొని వీధిలోకి పరుగెట్టాడు. వెనకనుంచి బామ్మ అరుస్తూనేఉంది “ఒరేయ్.... పిరికి సన్నాసి తలంటుకొని అలా వీధిలమ్మట తిరిగితే గాలి గీలి పట్టుకొంటుందని”. వీడేమీ వినిపించుకొనేలా లేడు పరిగెత్తుకొంటూ వెళ్లిపోయాడు.


సీను శీనుగాడి ఇంట్లోకి మారింది. ఈడు దేవుడికెట్టిన అటుకుల్లో హారతికర్పూరం కలుపుకొని తింటూ టివిలో ’ఆపద్భాందవుడు’ సినిమా చూస్తున్నాడు. అప్పుడే భానుగాడు ఆవేశపడుతూ వచ్చి శీనుగాడి పక్కనే కూర్చున్నాడు. చుట్టూ ఎవరూ లేకపోవడంతో... జేబులో కాగితం తీసి శీనుగాడికి చూపెట్టాడు మడత విప్పకుండానే. శీనుగాడది చూస్తూనే అడిగాడు
“ఏంట్రా అది”.

“ఉష్......ఇది లవ్వుత్తరం రా” భానుగాడి జవాబు.

ఎన్నోరోజుల్నించి బుజ్జికి ఉత్తరం ఇమ్మని శీనుగాడే పోరుపెడుతున్నాడు. ఇన్నాళ్లకి బానుగాడికి దైర్యం వచ్చినందుకు హేపి ఫీలయ్యి మిత్రోత్సాహంతో గర్వంగా ఈడిభుజం తట్టి నైతిక మద్దతు తెలిపాడు.

భానుగాడికి ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఎందుకైనా మంచిదని శీనుగాడితో “ఒరేయ్ శీనుగా ఈవిషయం మనిద్దరి మధ్యే ఉండాలి ఎట్టిపరిస్థితుల్లోను మూడోకంటోడికి ముఖ్యంగా వేణు గాడికి తెలియకూడదు....ఆడుగానొస్తే ఇంతకుముందులాగ ముగ్గురం బుక్కైపోతాం” అని దీనంగా వేడుకున్నాడు.

మూడోకన్ను ఉన్నోణ్ని శీనుగాడు ఎప్పుడూ చూడకపోవటంవల్ల ఏమీపర్లేదని అభయం ఇచ్చి  బానుగాడి కళ్లలోకి చూస్తూ ఆవేశంగా చెప్పాడు.

“ఒరేయ్....ఎవడడ్డొచ్చినా సరే నీ ప్రేమను గెలిపించటానికి నాప్రాణాలైనా ఇస్తానురా...... నావే కాదు మన చెరువు గట్టు బళ్లో చదువుతున్న పిల్లలందరూ ఆళ్ల ప్రాణాలివ్వటానికి సిద్దంగా ఉన్నారు” అని చెప్పి గట్టిగా “జ్జయం... నిశ్చయం” అని అరిచి ఆంజనేయస్వామి బొమ్మున్న ఎర్ర జెండా ఎగరేసాడు.


ఇప్పుడు భానుగాడు గట్టిగా గాలిపీల్చుకున్నాడు, అభిమానంగా శీనుగాడి వైపు చెయ్యిచాపాడు. అటుకులు అడుగుతున్నాడేమో అనుకొని శీనుగాడు గుప్పెడు అటుకులుతీసి భాను గాడి చేతిలో వేసాడు. మామూలుగా ఐతే శీనుగాడు పెట్టినియ్యేమీ తినడు కాని ఇవాళ ఏమీఆలోచించే స్థితి లో లేకపోవడం వల్ల గుప్పెడు అటుకుల్ని గబుక్కున నోట్లో వేసేసికున్నాడు. అప్పటికే వేడిగాఉన్న బుర్రలోకి హారతికర్పూరం వెళ్లడం తో కనిపించిన కన్నంలోంచల్లా పొగలొచ్చేస్తున్నాయ్ భానుగాడికి. మంటలార్పటానికి హడావిడిగా అక్కడున్న మంచినీళ్లు తీసుకొని ఒకగుక్క తాగేడు కాని అప్పటికే శీనుగాడు మంచినీళ్లలో మిరియాల పొడి కలిపేయటం వల్ల ఇంక తట్టుకోలేక నోట్లో తయారైన కొత్త మిశ్రమాన్ని పండక్కి కొత్తగా కొనుక్కున్న శీనుగాడి బట్టల మీదకి ఊసేసాడు.

                                                                           ***

దారిలో బుజ్జితో డ్యూయెట్ ఏసుకుంటూ సాయంత్రానికి ఇంటికి చేరాడు. అప్పటికే బామ్మ ఒక పురికొసకి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు దండలా గుచ్చి భానుగాడికి దిష్టి తియ్యటానికి రడీగాఉంది. వీడు రాగానే దండ మెళ్లో వేసి నుదిటికి నల్లగా పెద్దబొట్టు, చేతికి ఒక కత్తి ఇచ్చి ఇంటెనకాల అరుగుమీద కూర్చోబెట్టింది. వీటన్నికితోడు మళ్లీ ఒక కాగడా వెలిగించి సాంబ్రాణి పొగకూడా వెయ్యటంతో ఆప్రాంతమంతా భయంకరంగాఉంది. ఈడింకా డ్యూయెట్ లోంచి సరిగా బయటకి రాకపోవటం వల్ల ఏమి తెలియట్లేదు గాని  లేకపోతే అరుందతి లో సోనుసూద్ లాగ, అమ్మోరులో రామిరెడ్డి లాగ ఉన్న ఈడి గెటప్ చూసుకుంటే కళ్లు తిరగటంకాదు ఈసారి కోమాలోకి వెళ్లిపోయేవాడు.


ఇక భానుగాడు పెసిడెంట్ గారి దుంగలు దొంగతనానికి రానన్న రెండో కారణమేంటో...... వేణుగాడ్ని ఈ “ఆపరేషన్ లవ్వుత్తరం” కి దూరం ఎందుకుపెట్టారో తెలుసుకోడానికి రెపొచ్చే పెద్దపండగ దాకా ఎదురుచూడాలి.

44 comments:

మంచు said...

కెవ్వ్వ్.. సూపర్..బంపర్ .. మీరింతకీ బాను నా... శీనా ???

అహ..కొంచేపు ఫ్లాష్ బాక్ లొకివెళ్ళొచ్చా...

నేస్తం said...

భలే రాసారండీ .. సూపరు :)

జయ said...

ఆపుకోలేని నవ్వుతో నా పొట్ట పగిలిపోయిందండి.నవ్వు నాలుగు విధాల చేటని ఎందుకన్నారో నా కిప్పుడర్ధమైంది. నా పొట్ట తిరిగి అతికేసే ఆపరేషన్ ఖర్చులు మీవే...

Harish said...

Mastugundi.!

సుధాకర బాబు said...

"గలగలా గోదారి" గారూ! అద్భుతం. అమరావతి కథలు, పసలపూడి కథలు, తోటరాముడు బ్లాగు - ఈ మూడింటినీ రంగరించినట్లుగా ఉంది మీ శైలి. మీ రాతలు ఇలాగే కొనసాగించండి.

Shiva Bandaru said...

:)

Haritha said...

abba navvinche blogs chala start ayyai... keka

ఆ.సౌమ్య said...

అయ్ బాబోయ్ బాబోయ్ గోదారి బాసలో తేగ రాహేత్తనారు కదండి, సునీల్ డవిలాగులన్ని గుర్తొచేసినాయ్, ఆయ్ నిజమండీ.

తెగ నవ్వించీసినారండీ, పెద్ద పండగ రాగానే ఓ పాలి కబురెట్టండి, లగెత్తుకొచ్చేత్తాను మీ టపా సదవడానికి.

Raj said...

కౌడ్రి౦క్ = కుడితి....

excellent....post superb..awaiting for next one...

Sravya V said...

:)

మధురవాణి said...

సూపర్.. చాలా బాగా రాశారు. నవ్వలేక చచ్చాను :-)
waiting for the sequel :-)

హరే కృష్ణ said...

కేక

జేబి - JB said...

అదిరింది!!

3g said...

@మంచు - పల్లకీ: హి... హి మనకి ఈ రెండు కేరెట్టర్ లు చాలవండి ఇంకా చాలా సుగుణాలున్నాయ్.
ఐనా ఈ టపాలో ఉన్న పాత్రలన్నీ కేవలం కల్పితం అని ఎవరినీ ఉద్దేశించినవి కావని మనవి చేసుకుంటున్నాం:-)

@నేస్తం: షుక్రాన్ సాథిక్

@జయ: అలాగేనండి........ లేకపోతే కేసులవీ వేసేలాఉన్నారు attempt to murder అని.

@Tough Guy: Thanks.

@సుధాకర బాబు: చాలా సంతోషమండి, అమరావతి, పసలపూడి కథలు చదవలేదు కాని నా అభిమాన రచయితలైతే మాత్రం తోటరాముడు, నేస్తం, త్రివిక్రం. వాళ్ళ ప్రభావమైతే ఉండొచ్చు.

3g said...

@Shiva Bandaru: :-)

@Haritha: అవును కదా !!!

@sowmya: ఆయ్!!!! బేగొచ్చెయ్యండి కబురెట్టగానే.....
సునీల్ డవిలాగు గుర్తొచ్చినియ్యంటే బావుందన్నట్టాండి..... బూతులు తిట్టినట్టాండి.....

@raj: అయ్యో మీరు సరిగా చదవలేదండి కౌ డ్రింక్ అంటే జూనియర్ హార్లిక్స్ అని.

@ Sravya Vattikuti: :-)

@మధురవాణి: Thank you.

@ హరే కృష్ణ: Thank you.

@ JB: Thank You.

మంచు said...

నాకయితే ఇద్దరిలొ ఒకటి మీరే అనిపిస్తుంది.
అది సరే కానీ ఆ కింద నేస్తం గారిని ఎంటి హిందిలొ తిట్టారు.. నాకు చెప్పరా ప్లీజ్ :-)

నేస్తం said...

మంచు పల్లకి గారు అది అరబిక్ లో ధన్యవాదాలు అని ..:O లెంపలేసుకోండి ..(అంతేనా 3g గారు ..కాకపోయినా అంతే అంతే అనేసేయండి ఈ సారికి)
>>> నా అభిమాన రచయితలైతే మాత్రం తోటరాముడు, నేస్తం, త్రివిక్రం. వాళ్ళ ప్రభావమైతే ఉండొచ్చు.

బాబ్బాబు ఎవరన్నా కాస్త నిచ్చెన తీసుకురండి బాబు ..మునగ చెట్టు చిటారు కొమ్మ నుండి క్రిందకు ఎలా దిగాలో తెలియడం లేదు .

Ram Krish Reddy Kotla said...

టపా ఎప్పుడో చదివాను కాని కామెంట్ పెట్టడానికి మాత్రం లేట్ అయింది :-(...ఎందుకంటి అడగకండే..ఇక పోతే టపా ఇరగాదీసారు...కత్తి..కేక...కొడవలి. మీరు రాసిన గోదావరి యాస సూపర్బ్ అండి..హాస్యం కూడా మంచి టైమింగ్ తో ఉంది..హాయిగా నవ్వుకున్నాను...మిగతా వాళ్ళలా నాక్కూడా డవుటే, ఆ ముగ్గురిలో ఒకరు మీరని...శీను అని డౌట్ :-)

3g said...

మంచు గారు: నేస్తం గారిని తిట్టటమా..... అపచారం. షుక్రాన్(Shukraan) అంటే ధన్యవాదాలు, సాధిక్(Saathik) అంటే నేస్తం అని అర్ధమండి అరబిక్ లో (ఇంతకీ మీరు లెంపలేసుకున్నారా లేదా.....)

నేస్తంగారు భలేకనిపెట్టేసారండి, మీకు అరబిక్ వచ్చా...... అది చూసి మీరు కంగారుపడతారేమో అనుకున్నాను.
చెట్టు చివరిదాకా ఎందుకు ఎక్కేసారండి మీరుకూడా ఏమైనా ప్రయోగాలు చేస్తున్నారా ఏంటి మా వేణు గాడిలా..... అయినా మీరున్న ఎత్తులోంచి కిందకి దిగాలంటే నిచ్చెనలు చాలవండి రాకెట్ లాంటిది కావాలి ఉండండి జార్జ్ బుష్ తోచెప్పి చేయింద్దాం.

మంచు said...

ఎమో ఒకసారి సుభద్రగారిని అడిగి కంఫర్మ్ చేసుకున్నాక అప్పుడేసుకుంటా.. మీరందరూ తూ గొ జిల్లా పార్టి పెట్టేసి తొండి చేస్తే.. నేను నేస్తం గారి ఇంట్లొ బాస్ ని తోడు తెచ్చుకుంటా (మా జిల్లా కదా ) :-)) ఎది ఎమయినా పక్కగా ఇదే అర్ధం అని ప్రూవ్ అయ్యాకే లెంపలు గురించి అలొచించేది :-))

గ గ గో : మీరు గల్ఫ్ లొ వుంటారా ??

మంచు said...

మా కజిన్ ఒకడు ఇదే లిస్ట్ చేప్పాడు "తోటరాముడు, నేస్తం, త్రివిక్రం" .. సరే నేను ఒక లిస్ట్ తొ వస్తా :-))

ఆ.సౌమ్య said...

అబ్బే తిట్టలేదండీ, పొగిడీసినాను....మా ఇజీనారమోళ్ళకి సునీలంటే బాగ ఇది లెండి.

వలాగే బేగి పారొచ్చేత్తాను కబురెట్టగానే :)

3g said...

కిషన్ గారు: ఎందుకు లేట్ అయ్యిందో నాకుతెలుసండి పరవాలేదు. ఆ ముగ్గురిలో నేను ఎవరూకాదండి నేనుకూడా ఫ్రేంలోకి వచ్చేస్తే మీకు స్టోరీ ఎవరు చెపుతారు చెప్పండి.

మంచు గారు: ఎవ్వరినడిగినా........... ఇచ్చినతీర్పు మారదు. నన్ను తూ.గో లో వేసేసారేంటండి మనది ప.గో ప్రస్తుతం గల్ఫ్.
నాతో పాటు వేరేవాళ్లక్కూడా ఇదే లిస్ట్ ఫేవరెట్టా ........... గుడ్... ఐతే మీలిస్ట్ కూడా రాసెయ్యండి.

సౌమ్య గారు: ఐతే ఓకె. అవును మీరు పొరబాటుగా అమలాపురం అనుకొని ఇచ్చాపురం బండి ఎక్కేసారండి.
అర్ధం కాలేదా......."పొగిడీసినాను" & "వలాగే" ఇవి గోదారి వైపువి కావండి.

Anonymous said...

kadha bavundi. waiting for next one

కవిత said...

బాబోయి ,నాకు మీ యాస చదవటం చాలా కష్టం అయింది(నేను పక్క తెలంగాణ అమ్మయి ని లెండి)...కానీ నిజం గా సునీల్ గుర్తుకు వచ్చాడు.సూపర్ కామెడి ....అదిరింది మీ ప్రాస,యాస.నాకు గోదావరి యాస అంటే చాలా ఇష్టం...కొంచం నేర్పిద్దురు...????

3g said...

@కవిత: అలాగేనండి నేర్పించేద్దాం............ కాని కొంచెం ఖర్చవ్వుద్ది. నిజానికి నేను గోదారి యాసలో రాద్దామనుకున్నాను కాని సరిగాకుదర్లా!!!!!! మీకు కరెక్ట్ గోదారి భాష కావాలంటే శ్రీనివాసరాజు గారి ఈబ్లాగు చూడండి.
http://nivasindukuri.blogspot.com/search/label/%E0%B0%AA.%20%E0%B0%97%E0%B1%8B.%20%E0%B0%95%E0%B0%A7%E0%B0%B2%E0%B1%81

కవిత said...

బాగా కుదరకుండా రాసిన యాస నే చదవటం ఎ రాలేదు,ఇంకా అచ్చమయిన యాస నాకు నోరు తిరుగుతుంది అంటారా???ఖర్చు అవుతుందా??సరే అండి బదులు గా నేను మీకు తమిళ్ కానీ,తెలంగాణా కానీ నేర్పిస్త...ఏమంటారు మరి??

Harish said...

eagerly waiting for the next post..!

..nagarjuna.. said...

హహ్హహ్హ...హహ్హహ్హ.....
ఇగ సాలు నాయ్నోయ్ సాలు...
మీ టాలెంటు కాకులెత్తుకెళ్ల....ఎవరన్నా ఓ పేజిలో కామెది పెడతారు లేకపోతే ఓ పేరాలో కామెడి పెడతారు....హహ్హహ్హ..లైను లైనుకి పంచ్‌ డైలాగులా !!
కెవ్....

3g said...

Harish........ tnx for ur comment. I'll try to post next part in a couple of weeks.

నాగార్జునా........ ఏంటది కాకులెత్తుకెళ్ళాలా!!!! నన్ను బ్లాగుల్లో ఉండనివ్వకూడదనా ఏంటి??:-) నిన్న మీకామెంట్ చదివినప్పట్నించి గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుతూనేఉన్నాను. థేంక్స్.

Sai Praveen said...

మాస్టారూ .... సూపరు :)
ఇంత కంటే నేను చెప్పలేను. ఇంచు ఇంచుకో పంచు కొట్టారు మాస్టారు :)
>>రెపొచ్చే పెద్దపండగ దాకా ఎదురుచూడాలి.
(మర్యాద రామన్న ట్యూన్ లో పాడుకోండి)
ఎన్నాండ్లకు పెద పండగ వచ్చును
త్రీజీ కథ తరువాయేమయ్యెను
మా నవ్వులు మళ్ళెపుడిరబూయును
హో.... య!

రాజ్ కుమార్ said...

ఇరగదీసారు.. నాకైతే చదువుతున్నంత సేపూ వంశీ గుర్తోచ్చ్చాడు .... ఒక్క మాట లో చెప్పాలంటే రచ్చ చేసి పిచ్చేక్కించారు.:) :)
3G = వంశీ2 :) :) :)

నేస్తం said...

3g గారు అంటే మరీ ఇంత గ్యాప్ అవసరం అంటారా :)కధ మధ్యలో వదిలేస్తే ఎలా అండి

శ్రీనివాస్ పప్పు said...

"మూడోకన్ను ఉన్నోణ్ని శీనుగాడు ఎప్పుడూ చూడకపోవటంవల్ల ఏమీపర్లేదని అభయం ఇచ్చి బానుగాడి కళ్లలోకి చూస్తూ ఆవేశంగా చెప్పాడు"
అమ్మదీనమ్మాని ఇరగదీహారంతే.అవునూ ఇన్నాళ్ళూ ఈ పోస్టెలా మిస్సయాను చెప్మా?

3g said...

@ప్రవీణ్, వేణురాం, శ్రీనివాస్: థాంక్యు...థాంక్యు...థాంక్యు...

నేస్తంగారు అవసరమా అంటే తప్పట్లేదండి. నాకేమో నేను, భూమి, చంద్రుడు ఒకేసరళరేఖలోకొచ్చినప్పుడు మాత్రమే మూడొస్తూఉంటుంది రాద్దామని. అయినాసరే మీ అభిమానాన్ని ఆజ్ఞగా భావించి ప్రయత్నిస్తాను.

Sravya V said...

నాకేమో నేను, భూమి, చంద్రుడు ఒకేసరళరేఖలోకొచ్చినప్పుడు మాత్రమే మూడొస్తూఉంటుంది రాద్దామని.

--------------------------

అంటే మీరు భూమి మీద లేరా :)

3g said...

శ్రావ్య గారు మీరు భలే లాజిక్కులు తీస్తారండి. ఈ విషయం గురించి అసలో ప్రముఖ రచయిత ఏంచెప్పాడో తెలుసా. రచయిత ఎవరన్నాసరే రచించేప్పుడు భూమ్మీద ఉండడంట. ఆశల రాకెట్లో ఊహల ఇంధనం నింపుకొని విశ్వవిహారం చేస్తుంటాడట.
మళ్ళీ ఇదిచెప్పిన ఆ ప్రముఖ రచయిత ఎవరని అడక్కండి అది నేనే.:):);)

మంచు said...

3G: ఇలా చెప్తే నువ్వు వినేలా లేవు... నువ్వు ఒక్క వారం లొ కానీ సెకండ్ పార్ట్ రాయకపొయావో______________ ఇక మాటలుండవు...

Sravya V said...

మళ్ళీ లాజిక్ తప్పింది

------------------------------------------------------------

రచయిత ఎవరన్నాసరే రచించేప్పుడు భూమ్మీద ఉండడంట. ఆశల రాకెట్లో ఊహల ఇంధనం నింపుకొని విశ్వవిహారం చేస్తుంటాడట.

------------------------------------------------------------

ఇది రాసేటప్పుడు సంగతి మీకేమో రాయాలంటేనే మీరు , భూమి, చంద్రుడు ఒకేసరళరేఖలోకొచ్చినప్పుడు మాత్రమే మూడొస్తూఉంటుంది అంటున్నారు ఇది కుదిరే విషయమా :)

మరే నా లాజిక్ ని తక్కువ అంచనా వెయ్యొద్దు దాని వల్లే పాపం ఏదో నాకు నోట్లోకి నాలుగు వేళ్ళు వెళుతున్నాయి :)

3g said...

శ్రావ్యగారూ నేనునేలమీదుండి ఆలోచనల్ని ఆకాశంలోకి పంపిస్తానని చెపుదామనుకున్నాను కాని మరీ ప్రొఫెషనల్స్ తో పోటీపడేంత రిస్కెందుకని సైలెంట్ అయిపోయా.

మంచుగారూ మరీ వారంరోజులా..... ఇంకో పది పదిహేను రోజులు పొడిగించే అవకాశమే లేదా. సరే ____________ తప్పించుకోవాలంటే తప్పేలా లేదు.

వేణూశ్రీకాంత్ said...

కెవ్‍వ్‍వ్‍వ్‍వ్... ఈ టపా ఇన్నాళ్ళు నేనెలా మిస్ అయ్యానబ్బా !! నవ్వలేక చచ్చానండి బాబు, అదేయాసలో నెమ్మదిగా పైకి చదువుకుంటూ భలే ఎంజాయ్ చేశా.

ఐనా ఇలా మంచి టాలెంట్ ఉన్న రైటర్స్ అంతా ఇంతే లేట్ అనుకుంటా మరీ ఇంత టైం తీసుకుంటే ఎలాగండీ. పెద్దపండగ అంటే వచ్చే సంక్రాంతి టార్గెట్ ఎట్టుకోలేదు కదా.. అదేం కాదు కాని దీపావళి వచ్చేసింది కదా ఇక వేసేయండి. లేదంటే మంచుగారి ఆధ్వర్యంలో ధర్నాలు, బందులు, హర్తాళ్ళు, రైల్ రోకోలు, యిమానం రోకోలు రచ్చ రచ్చ ఐపోద్దంతే ఆ :-)

బులుసు సుబ్రహ్మణ్యం said...

వేణూ శ్రీకాంత్ గారి కెవ్వ్ విని ఇల్లా పరిగెట్టుకు వచ్చేసాను. నేను కూడా కెవ్ కెవ్వు. మిగతా కధంతా వెంటనే వేసేయండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.

3g said...

@వేణు శ్రీకాంత్: ఆలస్యంగా స్పందించినందుకు క్షమించండి. పోస్ట్ నచ్చినందుకు చాలా చాలా థేంక్స్. మీరు కనీసం ధర్నా అంటున్నారుకాని మంచుగారు అదేదో డాష్ పెట్టి బెదిరిస్తున్నారు. :)

@బులుసు సుబ్రహ్మణ్యంగారు: మీ కామెంట్ చూసి నాకుచాలా సంతోషం వేసింది. ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. పోస్టుతోనే రిప్లై ఇద్దామనుకున్నాను కాని కొన్ని అత్యవసర అనివార్య పరిస్థితులవల్ల లేటయింది.

ఏమైనా.... ఇంకా రాయలేదని ఎదిరించిన వాళ్ళకి ఇంకెప్పుడు రాస్తావని బెదిరించిన వాళ్ళకి ధన్యవాదాలు.

నీహారిక said...

మీ గోదారోళ్ళకి టాలెంట్ ఉంటుంది. కానీ నత్తలు...వెనకనుంచి తోస్తే కానీ పని చేయరు. సరే కానీండి ఎన్నాళ్ళు తీసుకుంటారో తీసుకోండి. మీ పిల్లలు వచ్చి పూర్తి చేస్తే కానీ అయ్యేట్లు లేదు.

Post a Comment