Saturday, July 10, 2010

ఉప్పొంగెలే.... గోదావరి (పాపి కొండలు ఫొటోస్ట్)

ఒక్కోసారి ఏముంటుందిలే అనుకుని సినిమా చూస్తే ఎంతోబావుందనిపిస్తుంది జంధ్యాల ఆనందభైరవిలాగ. ఇప్పుడు విషయం సినిమా గురించి కాదుగాని క్రిందటినెల్లో చూసిన పాపికొండలు గురించి.

ప్రతిసారి సెలవుల్లో ఇంటికెళ్లినప్పుడు ఫ్రెండ్స్ తోకలసి ఏదోఒక టూరుకెళ్ళడం అలవాటు.  ఈసారి కూడా ఎక్కడెక్కడికో వెళదామని ప్లాన్ చేసినా ఎందుకో ఏదీకుదరక చివరికి పక్కనే ఉన్న పాపికొండలు చూద్దామని ఫిక్సయ్యాం. ఇక చూడటం మొదలుపెట్టాకా ఎక్కడికొచ్చానో కాసేపు అర్ధంకాలేదు. సన్నగా పడుతున్న వర్షంలో తడుస్తూ బోటుపై నిలబడి గోదావరిని చూస్తూఉంటే............

మంటల కంఠంతో కసురుకుంటున్న సూర్యుడి వేడి ముప్పు తప్పించుకోడానికి ఆకాశం కప్పుకున్న మేఘాల పరదాలు చినుకు ముత్యాలు చల్లుతుంటే మురిసి ముద్దౌతున్న గోదారి పరువాలు ముద్దొస్తూ, ముందింత అందమున్నా మౌనమేంటని నిందిస్తూ, మొహమాటానికైనా నాలుగు మాటలు రువ్వమని కవ్విస్తూ, హొయల లయల చలన భంగిమల అందాల విందిస్తూ, మబ్బుల చాటుల్లోంచి తప్పించుకొచ్చిన వెలుగు రేఖల పువ్వుల్ని అలలపైన పూయిస్తూ, కాసుల వేటలోపడి గతితప్పిన మనసుల గమ్యాన్ని కాసేపైనా మళ్లిస్తూ, మరచిపోయిన ఙాపకాల్ని మళ్లీఇస్తూ, తీరిక లేదని చెప్పే సాకులకి పచ్చ పరికిణీ కప్పుకున్న ప్రకృతిసోకుల్ని ఎరగావేస్తూ, ఎగిరెగిరి పడుతున్న నా కళ్లలో ఆశ్చర్యాన్ని ఆస్వాదిస్తూ, మళ్లీరమ్మని ఆహ్వానిస్తూ, ఎపుడొస్తావని ఎదురుచూస్తూ.... ఉన్నట్టనిపించింది. ఇక వదలి వెళ్ళేప్పుడు మాత్రం కష్టాలన్నీ మర్చిపోగల  ఙాపకాలు మనసునిండా నిండిపోయినట్టనిపించింది.

ఆ ఫొటోలే మీకూ చూపిద్దామని ఈ ఫొటోస్ట్


ఇంచుమించు ఎనిమిది గంటలపాటు గోదారిపై సాగే ప్రయాణం మర్చిపోలేనట్టుగా మిగిలిపోవాలంటే మాత్రం ప్రకృతి కరుణించక తప్పదు. ఎందుకంటే పైన ఎండకాస్తుంటే మనంలోన కూర్చోవాలి. అదే ఆకాశమంతా మబ్బులు కమ్ముకొని సన్నగాచినుకులు పడుతుంటే చూడ్డానికి అద్దిరిపోద్ది. రాజమండ్రి దగ్గర ఆరుకిలోమీటర్ల వెడల్పున ప్రవహించే గోదావరి భద్రాచలం నుండి కొండల మధ్య వస్తూ సన్నటి పాపిటగా మారిపోతుంది అందుకే ఈ కొండలకి పాపిటకొండలని పేరు. కాని కాలం క్రమంగా మారుతూ వీటి పేరుని కూడా పాపికొండలుగా మార్చేసింది. (ఈ విషయం గైడ్ చెప్పేవరకు నాకు తెలీదు)