Monday, September 6, 2010

ది సిక్స్త్ సెన్స్ – చూసిందల్లా నమ్మకూడదని మీకెప్పుడైనా అనిపించిందా?

ఇపుడీ అయిపోయిన పెళ్ళికి ఆర్కెస్ట్రా ఎందుకని మీరు అనుకోకపోతే విడుదలైన పదకొండేళ్ళ తరువాత చూడగలిగిన ఈ సినిమా నాకు కలిగించిన అనుభూతి ఇక్కడ మీతో పంచుకోవాలనిపించింది. పదకొండేళ్ళు ముందు చూసుంటే నేను పెద్దగా పొడిచేది ఏమీ ఉండేదికాదనుకోండి, ఎందుకంటే నేను అప్పట్లో హాలీవుడ్ అంటే రోజ్ఉడ్ లాగ అదీ ఒకరకం చెక్క అనుకొనేవాణ్ణి. సరే ఈ విషయం వదిలేద్దాం.
బహుశా ఇది చదువుతున్న మీలో చాలా మంది ఈ సినిమాని ఇప్పటికే చూసిఉంటారు. 1999 లో విడుదలైన ఈ చిత్రం ఆ సంవత్సరపు రెండవ అత్యుత్తమ విజయాన్ని నమోదు చేసుకొంది. రచించడంతో పాటు దర్శకత్వం కూడా చేసిన మన ’నైట్ శ్యామలన్’ హిచ్ కాక్ తరహా సస్పెన్స్ చిత్రాలని మళ్ళీ హాలీవుడ్ తెరపైకి తీసుకొస్తాడని సినిమా ప్రేమికులకి ఆశలు రేకెత్తించిందీ చిత్రం.


కథ ఏంటని చూసుకుంటే నిండా నాలుగు వాక్యాల్లో చెప్పెయ్యొచ్చు. చనిపోయిన మనుషులు వచ్చి తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకొని భయపడే ఒక పిల్లాడి మానసిక సమస్యను నయంచెయ్యటానికి ఒక చైల్డ్ సైకాలజిస్ట్ చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అతను కోల్పోయే కుటుంబ జీవితం, దానివల్ల తన భార్య మరొకరికి దగ్గరవుతోందనే వేదన. వెరసి వన్ ప్లస్ వన్ ఆఫర్ లా ఒక సమస్య పరిష్కరించటానికెల్తే మరొకటి ఎదురుకావడం.


ఇలా అత్యంత సాధారణంగా అనిపించే ఈ కథలోకి మనల్ని అంతే సాధారణంగా తీసుకెళతాడు శ్యామలన్. ఫిలడెల్ఫియా నగర మేయర్ నుంచి చైల్డ్ సైకాలజీలో చేసిన సేవలకు గుర్తింపుగా డా.మాల్కం అందుకున్న ఙ్ఞాపిక తాలూకు సంతోషాన్ని అతని భార్యతో పంచుకుంటుండగానే, అతని వృత్తి జీవితపు ఒక వైఫల్యం పాత పేషెంట్ అయిన ఒక మానసిక రోగి రూపంలో వెంటాడుతుంది. కొంతకాలం తరువాత అలాంటి లక్షణాలతోనే ఉన్న తొమ్మిదేళ్ళ పిల్లాడు ’కోల్’ సమస్యని నయంచెయ్యటానికి డా.మాల్కం నియమించబడతాడు. సరిగ్గా ఇదే నిమిషం నుంచి శ్యామలన్ చేసే మాయ మొదలవుతుంది. ఒక డాక్టరుకి పేషెంట్ కి మధ్య ఉండాల్సిన సాధారణ సన్నివేశాల్ని నడిపిస్తూనే మన ఆలోచనల్ని, అంచనాల్ని క్రమంగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. తనకు కావాల్సిన దిశలో మన ఆలోచనల్ని మళ్ళిస్తూనే సన్నివేశాలకనుగుణంగా రాబట్టుకున్న కెమేరా, సౌండ్ వర్కుల సహాయంతో కోల్ తాలూకు భయానక పరిస్థితుల్లో నేరుగా మనల్ని నిలబెడతాడు. సరయిన సౌండ్ సిస్టమ్ లో చూడగలిగితే నాలుగైదు చోట్ల మీ గుండె ఝల్లుమనడం ఖాయం. ఇలా జరుగుతూ ఉండగానే డా.మాల్కం ఇంకా కోల్ ఒకరికొకరు ఇచ్చుకొన్న సలహాలతో కథ సుఖాంతం వైపు సాగుతూ ముగింపుకొస్తుంది. సుమారు వంద నిముషాలు గడచిన తరువాత కొద్ది మార్పులతో దాదాపు మనమూహించిన ముగింపు రాబోతోందనుకునేంతలో ఒక్కసారిగా కథను మనమాశ్చర్యపోయే మలుపు తిప్పుతాడు. అప్పటివరకు మన మనసులోనే మన ఆలోచనలతోనే కట్టుకున్న అంచనాలన్నీ ఒక్కసారిగా కూల్చేస్తాడు. తరువాత గాని మీ అంచనాలు మిమ్మల్ని మోసం చేసినట్టుగా తెలియదు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామాన్నించి మీరుతేరుకొనే లోపే ఇది నైట్ శ్యామలన్ చిత్రమనే టేగ్ లైన్ తో ఎండ్ క్రెడిట్స్ మొదలవుతాయి. థియేటర్ వదిలింతర్వాత ఎలా నువ్వు మోసపోయావని మీరేసిన ప్రశ్నకు సమాధానంగా మీ మనసు మళ్ళీ సినిమాను మొదటి నుంచి ప్లే చేస్తుంది. సమాధానం సులువుగానే దొరుకుతుంది అయినా మరింత స్పష్టత కావాలంటే తరువాతి ఆటకు టికెట్ తీసుకోవాలి లేదా మీ డి.వి.డి రిమోట్ లో మళ్ళీ ప్లే బటన్ నొక్కాలి.భారీ సాంకేతిక హంగులేవీ లేని ఈ సినిమాని మేటి థ్రిల్లర్ గా నిలబెట్టింది నిస్సందేహంగా శ్యామలన్ దర్శకత్వ ప్రతిభే అయినా, అతని ఆలోచనల్లో రూపుదిద్దుకున్న డా.మాల్కం, కోల్ పాత్రలకు తమ అద్బుతమైన నటనతో ప్రాణప్రతిష్ఠ చేసిన బ్రూస్ విల్లీస్ మరియు హాలే జోయల్ నటనా ప్రతిభ గురించి కూడా చెప్పుకొని తీరాలి. బ్రూస్ విల్లీస్ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చే ’డైహార్డ్’ లాంటి యాక్షన్ సినిమాల్లో హీరో పాత్రలకు భిన్నంగా దీన్లో అతను చూపించిన హావభావాలు చక్కని నియంత్రణతో ఉండి చూస్తున్నది సినిమా అని మనల్ని మర్చిపోయేలాచేస్తాయి. ఇక హాలే జోయల్ విషయానికొస్తే అతన్ని తొమ్మిదేళ్ళ కోల్ పాత్రలో చూస్తున్నంత సేపు అతనున్న పరిస్థితులకనుగుణంగా మన ప్రతిస్పందనలు కూడా మారుతూ ఉంటాయి........ లేదు లేదు మార్చుతూ ఉంటాడు.


మొత్తానికి దాదాపు రెండు గంటలు ఓపికగా సినిమా చుసిన మీకు టైం వేస్ట్ చేసాం అనే ఫీలింగ్ మాత్రం రాదు. ఒక మంచి సినిమాగా గుర్తుండిపోతుంది, చూసిందల్లా నమ్మకూడదనే నీతికూడా తెలుస్తుంది. తప్పకుండా చెప్పుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే ఏదైనా సినిమా చూసేముందు దాన్ని ముందుకి వెనక్కీ జరిపి చూడాలో వద్దో నిర్ణయించుకొనే నా స్నేహితుడొకరు, ఈ సినిమా పెద్ద బోరింగ్ అనే స్టాంప్ వేసేశాడు చూడకుండానే. వాడికి ఎన్ని సార్లు ముందుకి జరిపినా పై రెండు కేరెక్టర్లు తప్ప ఇంకేమీ కనపించలేదు మరి సినిమాలో.