Tuesday, May 11, 2010

ఏమైనాసరే ఇవాళే మొదలు

సరే..... ఇంతకీ నేను మొదలు పెడదామనుకున్నది అంగారకగ్రహం మీదకెళ్ళితిరిరావటానికి ఏదో వ్యోమనౌక లాంటిదనుకుంటారేమో అదికాదు ఆఫ్ట్రాల్ ఒక తెలుగు బ్లాగు.
ఇంతకుముందు ఇంగ్లీషు, హిందీ, సంస్కృతాల్లో బ్లాగులు పెట్టేసి ఇప్పుడు తెలుగు కోసం చూస్తున్నానని మళ్లీ అపార్దం చేసుకోకండి మనకి తెలుగే తెలిసీ తెలీకుండా తెలుసు ఇంక మిగతాభాషలు రాస్తే చూసే జనాలు మసే.

తెలుగు బ్లాగుని అఫ్ట్రాల్ అన్నానని నామీద రౌడీల్ని గట్రా పెట్టి యుద్దాలు అవీ ప్రకటించేయకండి అది నిజానికి అన్నది కాదు అనుకున్నది.


సుమారుగా ఆరునెలల క్రితం ఆఫీస్ లో కూర్చుని ఏంచెయ్యలో తోచక అంతర్జాలంలో అడ్డమైన చెత్తా చూస్తూండగా అకస్మాత్తుగా ఒక విషయం కంటపడింది దాని తెలుగు సారాంశం ఏంటంటే తెలుగులో చాలా అంశాల మీద బ్లాగులున్నాయని.

సరే కదా ఈ బ్లాగులేంటో చూద్దామని వచ్చిన లంకె మీద ఒక క్లిక్కు క్లిక్కా అంతే .......... మనసు పులకరించే సంతోషం, ఒళ్లు జలదరించే ఆశ్చర్యం......

విమల 25, కమల 22, ప్రమీల 19 అని నవ్వూతూ ఉన్న ఓ మూడు అమ్మాయిల బొమ్మల్తో పాటు ఒక ప్రకటన కూడా వచ్చింది మీకుగాని ఈ అమ్మయిల్లో ఎవరైనా నచ్చితే వెంటనే వివరాలు పంపించండి పెళ్లిచేసేస్తాం అని.

నేను ఏవిషయమైనా కొంచెం హింట్ ఇస్తే పట్టెయ్యగలగటం వల్ల తెలుగు బ్లాగులు చూడాలంటే పెళ్లయి ఉండాలని, అవ్వకపోయుంటే బ్లాగు చూసేముందే వాళ్లే ఎవర్నోచూసి చెహేస్తారని సులువుగానే అర్దమైపోయింది. కాని అప్పుడు ఒకటే టెన్షన్ బ్లాగులు చూట్టానికి పెళ్లి చేహేసికోవచ్చు అమ్మాయిలు కూడా నవ్వుతూ బాగానే ఉన్నారు కాని ఈ విషయం ఇంట్లో ఎలాచెప్పాలి అనేది ప్రోబ్లం. ఒక వేళ చెప్పకుండా చేహేసికొంటే తరవాత ఇంట్లో వాళ్లు చూసిన అమ్మయికి నొ ఎలా చెప్పాలా అని అదో టెన్షన్.

ఇప్పటికే ఇంట్లోవాళ్లు ఏమీ కంగారు పడట్లేదుకాని బయట వేలం పాట మొదలైపోయిందని టాకు లీకైపోయింది, అందులోను నాకు తెల్సినొకాయన వెయ్యి నూట పదహార్లు, ఒక పాత సైకిలు తోటి దేవుడిపాట కూడా మొదలెట్టేహేడంట.

ఎందుకొచ్చిన గొడవలే ఇప్పుడు బ్లాగులు చూడప్పోతే కొంపలేమి ములిగిపోవని రెండు రోజులు సైలెంట్ గాఉన్నా కాని ఆ ముగ్గుర్లోని 19 నెంబరున్న చుడీదార్ అమ్మాయి పదే పదే కల్లోకిరావడం మొదలుపెట్టింది. ఇంక లాభంలేదు ఎలాగైనా ఈ సంబందం మాట్లాడెయ్యాలని డిసైడింగ్ అయిపోయి ఓ పెద్దమనిషి పక్కనుంటే పద్దతిగాఉంటాదికదా ఇలాంటి ఇషయాల్లో అని పక్క కేబిన్లో పనిచేస్తున్న పరమేశ్వర్ అంకుల్ ని పిల్చుకొచ్చాను.

ఆ పిల్లని చూపించగానే అంకుల్ మొఖం రికార్డింగ్ డేన్స్ లో రంగులైట్లు ఏసినట్టు రకరకాలుగా అయిపోయింది. విషయమేంటాఅని కనుక్కుంటే బాబాయి వయసులో ఉండగా కూడా ఈ పిల్లకి వయసు పంతొమ్మిదే అని, అప్పట్లో మనోడు కూడా ఇదే ఫొటో చూసి మనసు పడేసికున్నాడని, ఆ తరువాత పదే పదే పర్సు పడేసికున్నాక తెల్సిన విషయమేంటంటే సదరు పిల్ల అప్పటికే ఇద్దరు పిల్లలకి తల్లని.

ఆదెబ్బతో నేను క్లిక్కిన క్లిక్కు ఇచ్చిన కిక్కంతా వదిలిపోయి మామూలు లోకంలోకొచ్చాను. అప్పటికిగాని తెలిసిరాలేదు నేనేసిన లంగరు పక్క లంకె మీదపడిందని. తెలిసింతర్వాత ఈసారి ఆచితూచి రెండు చేతుల్తో మౌసట్టుకొని జాగర్తగా క్లిక్కాను కూడలి మీద. ఇక అప్పుడు మొదలైందండి బ్లాగోతం.

అప్పట్నించి బ్లాగ్లోకంలో లేస్తూ పడుతూ, చూస్తూ తిడుతూ కొన్నాళ్లు గడిపింతర్వాత ఇప్పుడిప్పుడే.... ఆఫ్ట్రాల్ బ్లాగేకదా మనం కూడా బ్లాగుదామని డిసైడింగ్ అయిపోయాను.

ఆతర్వాతే అసలు ఖష్టాలు మొదలయ్యాయి. ఎలాంటి కష్టాలంటే చిన్నప్పుడు.... అంటే నాలుగు ఐదో క్లాసు చదువుతున్నప్పుడు ఇంట్లో ఇచ్చిన చిల్లర డబ్బులన్నీ పోగేసి ఒక పెద్ద డిబ్బీ కొనేవాణ్ని తీరా అది కొన్నాక దాంట్లో వెయ్యటానికి డబ్బులు మిగిలేవికావు. దాంతో అదట్టుకొని తుఫాను బాదుతులకి విరాళాలకోసం తిరిగినట్టు ఇంట్లో అందరిదగ్గరికి తిరిగేవాణ్ణి డబ్బులెయ్యమని. అలాక్కూడా పనవ్వకపోతే ఇంట్లో పిల్లలందర్నీ పోగేసి ఆళ్ళ డబ్బుల్ని ఇందులో దాసుకోమనేవాడ్ని బేంక్ లాగ. తరవాత అవికూడా చిన్న ఊసముక్కపెట్టి నేనే తీసేసేవాణ్ణనుకోండి. పాపం వాళ్ళ పరిస్థితే కృషిబ్యాంక్ లో డిపాజిట్లు కట్టినట్టు అన్యాయం అయిపోయేది.

ఇప్పుడిదెందుకు చెప్పానంటే బ్లాగులు చూసి చూసి మనమూ రాసేద్దామని వచ్చిన వీరావేశమంతా ఖర్చుపెట్టి బ్లాగుపేరు, ఓబొమ్మ పెట్టేశాను. ఇప్పుడు దాంట్లో ఏమన్నారాద్దామంటే కొంచెం కూడా ఆవేశం మిగల్లేదు. సర్లే పక్కోళ్ళ డబ్బులు మన డిబ్బీలో ఏసుకున్నట్టు ఏదైనా సైట్ చూసి కంట్రోల్ పట్టుకొని CV నొక్కేద్దాం అనుకున్నాకాని అసలే మన బ్లాగ్లోకంలో డిటెక్టివ్లెక్కువ అందుకే ఆగిపోయా. కామెంట్లురాసుకుంటూ కాలంగడిపేద్దామని డిసైడింగ్ అయిపోయా.

కాని నాలో పడుకునున్న ఆవేశాన్ని కొంతమంది (నేస్తం, కిషన్, రిషి, మాలా కుమార్ గార్లు) నీళ్ళుచల్లి నిద్రలేపడంతో ఏదోటి రాసెయ్యాలని ఓకథ రాయడం మొదలుపెట్టా,

అదెలాసాగుతుందంటే పైనేసిన రెండు రీళ్ళు మళ్ళీ ఎయ్యాలి, ఐనాసరే రాసినంతవరకు రేపో ఎప్పుడో వదుల్తా.

ఏదో మరీ రోజుకి పది పోస్టులు వెయ్యప్పోయినా కనీసం పదిరోజులకొక పోస్టు వేద్దామని లేటెస్ట్గ్ గా డిసైడింగ్ అయ్యా. నేనింతవరకు అనుకున్నవి చేసినట్టు ఆధారాల్లేవనుకోండి ఆ విషయం పది పదిహేను రోజులయ్యాక మీకే తెలిసిపోద్ది.

17 comments:

శరత్ కాలమ్ said...

:)

Sravya V said...

వేసిన రెండు రీళ్ల ట్రయలర్ బాగుంది అసలు సినిమా రిలీజ్ ఎప్పుడో మరి :)

మంచు said...

ఓ.. ట్రైలెర్ అదిరింది..

అక్షర మోహనం said...

Wish you all the best.

విశ్వ ప్రేమికుడు said...

బాహాగా ఉంది బ్రదరు. ఇంతకీ 3g అంటే ఏహేంటి చెప్మా!? :)

3g said...

@శరత్, @మంచు, @అక్షర మోహనం: Thank u
@శ్రావ్య: ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయండి. first part వదుల్తాం అతి త్వరలో.
@విశ్వ ప్రేమికుడు: gala galaa godariలో మొదటి మూడు g లు 3g గా మార్చాను బ్రదర్, nothing else.

నేస్తం said...

3జి కి ఇంత వివరణ ఉందా :) ...బాగుంది ... నెనూ అంతే ఎదైనా వ్రాయాలంటే అప్పటికప్పుడు రాసేయాలి..లేదా ఇంక రాయను అంతే .. ఇంట్రెస్ట్ పోతుంది

మధురవాణి said...

మీరు బ్లాగు మొదలెట్టి రాద్దాం.. అనుకున్న సంగతులే ఇంత బాగున్నాయి. మీరింకా ఒరిజినల్ పోస్ట్ రాస్తే ఎంత బాగుంటుందో..waiting for your 'సగం రాసిన కథ'.
3g అంటే నేనింకా మీకు ఐఫోన్ 3g అంటే ఇష్టమేమో.. అందుకే అలా పెట్టారనుకున్నా.. ఎంత తెలివో కదా నాకు ;-)
Wish you happy blogging! :-)

Sujji said...

:D all the best

Ram Krish Reddy Kotla said...

3g బాబు...మొత్తానికి నీ బ్లాగ్ కార్యరూప కారకులలో నేను కూడా ఒకడిని అయినందుకు సంతోషం..నీ టపా కోసం ఎదురు చూస్తూ ఉంటాను :)

మంచు said...

3g అంటే 3G wireless technologies మీద పనిచేస్తున్నారనుకున్నా :-))

హరే కృష్ణ said...

బావుంది
కంటిన్యూ

3g said...

@నేస్తం: అవునా అప్పటికప్పుడు అంతంత పోస్టులు ఎలారాసేస్తారండీ....... మీరలాగే ఎప్పటికైనా చక్రవాకం లాంటి సీరియల్ రాసిపడెయ్యాలని నా కోరిక మీ అమ్మగారి కోరికతోపాటు.
@మధురవాణి: ఏంటో అలా రాసేసానండి ఈసారికి ...... తరువాత వాటి మీద మరీ అంత అంచనాలు పెట్టుకోకండి.
@Sujji: Thank u.
@Kishen Reddy; నాక్కూడా సంతోషంగా ఉందండి మీరు రావడం.
@మంచు - పల్లకీ: అలా అనుకున్నారా!!!... నాకు వైర్లున్న టెక్నాలజీ వాడడమే సరిగారాదు. ఇంక వైర్లెస్సు మీద పనిచెయ్యడమా...:-))
@హరే కృష్ణ: Thank u.

మాలా కుమార్ said...

మీరు రచయతా ? బాగా రాసారు .
హాపీ బాదింగ్ .

3g said...

రచయిత అదీ కాదండీ ఇదే మొదటిసారి రాయడం. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి said...

బాగుందండీ..మీ టైటిల్ కి తగ్గట్టే వుంది టపా కూడా.. ఇలాగే గల గల గోదారిలా కబుర్లు చెప్తూ వుండండి.

Sai Praveen said...

మిగత రెండు టపాలకు పొగుడుతూ కామెంట్ పెట్టాను కాని ఈ సారి మాత్రం పొగడ్తల్లేవు.
సూటిగా ఒక ప్రశ్న. ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఎందుకు తరచుగా రాయట్లేదు?
మేము బాగా నవ్వేస్తామని మీకు కుళ్ళు కదూ :P

Post a Comment